Monday 30 June 2014

చితికిపోయిన వలస బతుకులు............ సాక్షి సౌజన్యముతో

ఉన్న ఊళ్లో ఉపాధి కరువై.. బతుకు భారమై.. పొట్ట కూటి కోసం వందల కిలోమీటర్లు దాటి వెళ్లిన వారు.. బతుకుపోరులో సమిథలయ్యారు. చిన్న పిల్లలను కుటుంబ సభ్యుల వద్ద విడిచి వెళ్లి.. మృత్యుకుహరంలో కూరుకుపోయారు. నాలుగు రాళ్లు వెనకేసుకుందామనుకున్న వారి కలలు కల్లలయ్యాయి. పిల్లలకు మంచి చదువు చెప్పించాలన్న ఆశయం శిథిలాల కింద చిక్కుకుంది. రెండు రోజుల నుంచి ఏమయ్యారో తెలియక.. ఫోన్ మోగితే ఏ దుర్వార్త వినాల్సి వస్తుందోనన్న భయాందోళతో కుటుంబ సభ్యులు బిక్కుబిక్కుమంటున్నారు. తమ తల్లి దండ్రుల యోగ క్షేమాలు తెలియక  చిన్నారులు బిత్తర చూపులు చూస్తున్నారు.
 
 విషాద వీచిక
 హిరమండలం (లక్ష్మీపురం) : చెన్నై ప్రమాదంలో శిథిలాల కింద చిక్కుకున్న గొట్ట, లక్ష్మీపురం గ్రామాలకు చెందిన  ఆరుగురూ.. నిరుపేద కుటుంబాలకు చెందిన వారే. ఉన్న ఊళ్లో ఉపాధి కరువై..నాలుగు రాళ్లు వెనకేసుకునేందుకు వెళ్లి..విగతజీవులైన  మీసాల శ్రీను, కుమార్తె భవానీ, కొంగరాపు శ్రీను, భార్య కృష్ణవేణి, సారవకోట మం డలం పాయకవలసకు చెందిన శ్రీను బావమరిది ముద్ద శ్రీను, లక్ష్మీపురానికి చెందిన పెసైక్కి జ్యోతిలది ఒక్కొక్కరిదీ ఒక్కో దీనగాథ.
 
 సంక్రాంతి అనంతరం వెళ్లి..
 గొట్ట గ్రామానికి చెందిన మీసాల శ్రీను కుటుంబం ఈ ఏడాది సంక్రాంతి అనంతరం చెన్నై వెళ్లింది. పెళ్లీడుకొచ్చిన కుమార్తె కళ్లెదుటే కనిపిస్తుండడంతో..నాలుగు పైసలు వెనకేసుకుందామనుకున్న వారి ఆశలు అడియాసలయ్యారు. భారీ భవంతి కూలడంతో తండ్రీ కూతుళ్లు చిక్కుకున్నారు. శ్రీను భార్య వరలక్ష్మి ఇటీవల గ్రామానికి వచ్చి..శనివారమే చెన్నై బయల్దేరింది. మార్గమధ్యలో ఉండగానే..భర్త, కుమార్తె శిథి లాల కింద ఉండిపోయారన్న  విషయం తెలియడంతో..ముందుకెళ్లే ధైర్యం చెయ్యలేక పుట్టెడు దుఃఖంతో విజయవాడ నుంచి వెనుదిరిగింది. కుమారుడు లోకేష్ మాత్రం తండ్రి, చెల్లెలు కోసం సంఘటన స్థలంలో రోదిస్తున్నాడు.
 
 భార్యాభర్తలు..
 అదే గ్రామానికి చెందిన కొంగరాపు శ్రీనుది విషాద గాథ. పిల్లలు సుస్మిత, సాయిలను వృద్ధులైన తల్లిదండ్రులు తులసమ్మ, రాములు వద్ద ఉంచి..నలభై రోజుల క్రితమే కూలిపని కోసం భార్య కృష్ణవేణి, సారవకోట మండలం పాయకవలసకు చెందిన బావమరిది ముద్ద శ్రీనుతో కలిసి చెన్నై వెళ్లాడు. భవన ప్రమాదంలో ముగ్గురూ చిక్కుకున్నారు. కృష్ణవేణి చిన్న సోదరుడు శ్యామలరావు పాముకాటుతో పదేళ్ల క్రితమే చనిపోవడంతో  కన్నబిడ్డలెవరూ దక్కకుండా పోయరంటూ ఆమె తల్లి..విలపిస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది.
 
 పిల్లలను వదిలి వెళ్లి..
 ఈ దారుణంలో బలైన జ్యోతిది మరో గాథ. పిల్లలు శ్రీను, మౌనికలను కుటుంబ సభ్యుల వద్ద ఉంచి..భర్త సింహాచలంతో కలిసి ఉపాధి కోసం  ఇటీవలే.. చెన్నైకి వెళ్లింది. భర్త సిం హాచలం టీ తాగేందుకు బయటకు వచ్చి..తి రిగి వెళ్లేసరికి జ్యోతి భవన శిథిలాల కింది చిక్కుకుంది. ఈ దారుణాన్ని కళ్లారా చూసిన సింహాచలం అక్కడే కుప్ప కూలిపోయాడు.  మనుమలు తల్లి ప్రేమకు దూరమయ్యారంటూ.. ఆమె అత్త  విలపిస్తోంది.
 
 చెన్నై వెళ్లిన అధికారులు
 పాలకొండ రూరల్: చెన్నై మాంగాడు బహుళ అంతస్తుల భవనాలు ఆకస్మికంగా కూలిపోవడం..అక్కడ పాలకొండ డివిజన్‌కు చెందిన పలువురు శిథిలాల కింద చిక్కుకోవడంతో అధికారులు హుటాహుటిన చెన్నైకి బయల్దేరారు. వారి క్షేమ సమాచారం తెలుసుకుని, అవసరమైన సేవలు అందించేందుకు పాలకొండ ఆర్డీవో తేజ్‌భరత్‌తో పాటు రాజాం తహశీల్దార్ జె.రామారావు, హిరమండలం ఆర్‌ఐ శంకరరావు ఒక బృందంగా చెన్నైకి వెళ్లారు.
 
 కంట్రోల్ రూమ్ ఏర్పాటు
 శిథిలాల కింద చిక్కుకున్న వారి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించేందుకు తన కార్యాలయంలో  ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ఆర్డీవో తేజ్ భరత్ తెలిపారు. బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు 08941-260144 నంబర్‌కు ఫోన్ చేసి, సమాచారం తెలుసుకోవచ్చన్నారు. భామిని మండలానికి చెందిన ఇద్దరు, కొత్తూరులో ముగ్గురు, హిరమండలంలో ఐదుగురు, పాలకొండలో ఒక కుటుంబానికి చెందిన బాధితులున్నట్లు ఇప్పటి వరకు తమకు సమాచారమందిందన్నారు. కంట్రోల్ రూమ్ ఇన్‌చార్జిగా కార్యాలయ ఉపగణాంక అధికారి ఇ.లిల్లీ పుష్పనాథం వ్యవహరిస్తున్నారు.
 
 ఆలస్యంగా..!
 శ్రీకాకుళం: పొట్ట కూటి కోసం  చెన్నై వెళ్లి.. బహుళ అంతస్తుల భవంతి కూలిన ప్రమాదంలో జిల్లా వాసులు చిక్కుకున్నా అధికారు లు ఆలస్యంగా స్పందించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రమాదంలో పాలకొండకు చెందిన ఐదుగురు,  హిరమండలం గొట్ట గ్రామానికి చెందిన ఐదుగురు, లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఒకరు, కొత్తూరు మండలం ఇరాపాడు వాసులు ముగ్గురు, భామిని మండలం కొరమకు చెందిన ఇద్దరు, లక్ష్మీనర్సుపేట మండలానికి చెందిన ఇద్దరు, నరసన్నపేట మండలం బాలసీమకు చెందిన ఒకరు  శిథి లాల కింద చిక్కుకున్నట్లు వారి కుటుంబ సభ్యులకు సమాచారమందింది.  ఇంతటి  ఘోర ప్రమాదం జరిగినా..అధికారులు ఆల స్యంగా స్పందించడంపై బాధితుల బంధువులు, కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. పొరుగు జిల్లా విజయనగరం బాధితుల కోసం అక్కడి  కలెక్టర్ స్పందించినా.. మన వారికి పట్టకపోవడమేమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. బాధితుల సంఖ్య పాలకొండ డివిజన్‌లో ఎక్కువగా ఉండడంతో  ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు  ఆర్డీవో తేజ్ భరత్ రాజాం తహశీల్దార్, హిరమండలం ఆర్‌ఐతో కలిసి చెన్నై బయల్దేరారు.
 
 కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు
 ప్రమాదంపై బాధిత కుటుంబాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.  నెంబర్లు: 18004256625, 08942-225361, 9652838191కేటాయించారు.
 
 చెన్నైకి వెళ్లిన బంధువులు
 కొందరు బాధితుల బంధువులు  శనివారం రాత్రే చెన్నై బయలుదేరి వెళ్లారు. అధికారులు కూడా కచ్చితమైన సమాచారం ఇవ్వక పో యినా.. సేకరించిన వివరాలు ప్రకారం 19 మంది వరకు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం.మన అధికారులు మాత్రం ఎంచక్కా..తమిళనాడు అధికారులు ఏమీ చెప్పడం లేదని వారిపైకి తోసేస్తున్నారు. కానీ నెల్లూరు జిల్లా కలెక్టర్ ఎన్.శ్రీకాంత్‌ను సంప్రదించామని,సహాయక చర్యలు చేపట్టేందుకు సహకరించాలని కోరామని పేర్కొన్నారు.
 
 కొరమలో విషాదం
 భామిని (కొరమ): కొరమకు చెందిన దంపతుల ఆచూకీ తెలియకపోవడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. చెన్నైలో భవనం కూలి దాసరి రాము(35), కుమారి(29) శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలియడంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆదివారం ఆర్‌ఐ పైడి కూర్మారావు, వీఆర్ వో కె.కృష్ణారావు, వీఆర్‌వోల సంఘ అధ్యక్షుడు కె.సన్యాసిరా వు తదితరులు బాధిత కుటుం బాన్ని పరామర్శించి, ఓదార్చా రు. వీరు ఈ ఏడాది జనవరిలో ఇక్కడి నుంచి వలస వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. వీరితో పాటు వెళ్లిన మరో నలుగురు క్షేమంగా ఉన్నట్లు ఇక్కడి వారికి సమాచారమందింది.

Wednesday 18 June 2014

ఇరాక్ లో 600 మంది తెలంగాణవాసులు ,,,,,,,,,,,,,,,,,సాక్షి సౌజన్యముతో


ఇరాక్ లో 600 మంది తెలంగాణవాసులుఇరాక్ లో ప్రస్తుత పరిస్థితి
ఢిల్లీ/హైదరాబాద్: ఇరాక్ లో ఉన్న 600 మంది భారతీయుల యోగక్షేమాలను తెలుసుకోవడానికి భారత విదేశాంగ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. ఇరాక్ లో అంతర్యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. చమురు సంపద పుష్కలంగా ఉన్న ఇరాక్‌లోని మోసుల్ నగరంలోని ఒక కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 40 మంది భారతీయులు జాడ తెలియడం లేదు. వారిని ఎఎస్ఐఎస్ తిరుగుబాటుదారులు తీసుకువెళ్లి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐఎస్ఐఎస్‌కు, కుర్ద్‌లకు మధ్య జరుగుతున్న యుద్ధానికి మోసుల్‌ ప్రధాన కేంద్రం అయింది. ఇక్కడ నుంచి ప్రజలను ఖాళీ చేయించే సమయంలో చాలా మంది కార్మికులతో అధికారులకు సంబంధాలు తెగిపోయాయి. కుర్ద్‌ల ప్రాబల్యం ఉండే ఈ ప్రాంతాన్ని ఐఎస్ఐఎస్ ఆక్రమించింది. ఆ తరువాత భారత కార్మికుల జాడతెలియలేదు. అయితే భారత విదేశీ వ్యవహారాల శాఖ వద్ద ఎటువంటి సమాచారంలేదు.  మోసూల్‌లో అభద్రత మధ్య 40 మంది భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది. వారి యోగక్షేమాలు తమకు తెలియదని విదేశాంగ శాఖ చెబుతోంది. భారత రాయబారి సురేష్‌రెడ్డి హుటాహుటిన ఇరాక్‌కు బయలుదేరారు.

 ఢిల్లీలో విదేశీవ్యవహారాల మంత్రి శాఖ కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు:
+91 11 2301 2113
+91 11 2301 7905
+91 11 2301 4104
Email: controlroom@mea.gov.in

బాగ్దాద్‌లోని భారత దౌత్య కార్యాలయం :
+964 770 444 4899
+964 770 484 3247

Tuesday 17 June 2014

ఆత్మహత్యే ఆకాంక్షగా.. - కంచ ఐలయ్య

ఆంధ్ర జ్యోతి సౌజన్యముతో : 05-06-2014 00:17 AM


ముందు, ముందు కొత్తగా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరక్కపోయినా, స్కూళ్ళు కాలేజీలు సరిగా నడువకపోయినా రాష్ట్ర ఉనికే వాస్తు ప్రకారం లేదంటే అందరూ నమ్మే పరిస్థితి ఉన్నది. ఈ మొత్తం ప్రక్రియ సమాజాన్ని క్రమంగా ఆత్మహత్య భావంలోకి నెడుతుంది. ఆత్మహత్యే లక్ష్యంగా పెట్టుకున్న వ్యక్తులు, గుంపుల్ని, సంస్థల్ని హేతువు ద్వారా బాగుచెయ్యడం అంత సులభమైన పనికాదు.
గత కొంత కాలంగా దేశమంతటా ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. సమైక్యాంధ్రప్రదేశ్‌లో అదే మోస్తరులో ఆత్మహత్యలు పెరిగాయి. తెలంగాణలో అవి మరీ పెరిగాయి. ఈ పరిణామక్రమంలో కొత్తగా ఏర్పడిన రెండు రాష్ట్రాల్లోనూ, దేశమంతటా కాంగ్రెస్ ఆత్మహత్యే ఒక ఆకాంక్షగా పనిచేసింది. ఇవి దాదాపు ఆత్మహత్య రోజులేమో అనిపిస్తుంది.
ఒక వ్యక్తి గానీ, సంస్థ గానీ, పార్టీ గానీ ఆత్మహత్యను ఒక ఆకాంక్షగా మలుచుకున్నప్పుడు వారిని/వాటిని ఎవరూ కాపాడలేరు. మన దేశంలో కాకపోయినా ప్రపంచంలో చాలా గొప్ప తత్వవేత్తలు ముందు ఆత్మహత్యా ప్రయత్నం చేసుకొని, వివిధ కారణాల వల్ల చేసుకోలేక బతికి బయటపడి ఆ ప్రయత్న అనుభవాల గురించి రాశారు. ఆత్మహత్యకు సిద్ధపడ్డవాళ్ళు నిరంతరం అదే తమ లక్ష్యంగా జీవిస్తారట. ఎలా ఆత్మహత్య చేసుకోవాలో ఆలోచిస్తుంటారట.. పద్ధతులపై ప్లాన్లు వేసుకుంటూ ఉంటారట.
ఆత్మహత్య ఒక పిరికి వ్యక్తి, సంస్థ లేదా సమాజం పని అయినప్పటికీ పిరికితనాన్నంతా కూడగట్టి అది ఆత్మహత్య చేసుకునే ధైర్యంగా మారాక తమను తాము అంతం చేసుకుంటారు. ఆత్మహత్య ఆకాంక్ష, అందరిలో అన్ని వేళల్లో ఉండే జీవన ప్రక్రియ కాదు. అది కొందరిలో, కొన్ని సందర్భాలలో కారణాలు ఉన్నా లేకున్నా ఒక ప్రక్రియగా రూపొందుతుంది. ఉదాహరణకు తెలంగాణలో గత నాలుగేళ్లలో వ్యక్తులు చేసుకున్న ఆత్మహత్యలు ఏ హేతుబద్దతకూ అందనటువంటివి. ఆత్మహత్యకు హేతువుకు సంబంధం ఉండదు. అదొక ప్రత్యేక ఆలోచనా ప్రక్రియ. ఈ విధమైన వ్యక్తుల ఆత్మహత్యలను అరికట్టడానికి ఏం చెయ్యాలనేది ఒక అంశం.
కానీ సంఘాలు, సంస్థలు, పార్టీలు ఆత్మహత్య ఒక ఆకాంక్షగా పనిచెయ్యడం మొదటిసారి కేంద్రంలోనూ, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోనూ మనం చూశాం. ఈ ఎన్నికల్లో బీజేపీ దేశ స్థాయిలో కాంగ్రెస్‌ను హత్య చెయ్యలేదు. అది స్వయంగా ఆత్మహత్య ప్రక్రియలోకి దిగింది. అది మిగతా కారణాలతో పాటు రాష్ట్ర విభజన ప్రక్రియను ఒక ఆత్మహత్య పద్ధతిగా ఎన్నుకున్నది. 2009 డిసెంబర్‌లో విభజన ప్రకటనతో వ్యక్తుల ఆత్మహత్యలు మొదలై 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఆత్మహత్యతో ఆ ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది.
ఒక రాష్ట్ర విభజన పాలసీ నిర్ణయం కాదు. ఆ నిర్ణయాన్ని ఒక ఎన్నికల అంశంగా దేశం ముందు పెట్టి ఎన్నికల ప్రక్రియను తన వైపునకు మలుపుకోగలిగే ప్రక్రియ కాదు. అయినా ప్రతిపక్ష బీజేపీ 2013 ఆగస్టు 11న హైదరాబాద్‌లో నరేంద్ర మోదీ మొదటి ప్రచార సభ నిర్వహించ తలపెడితే జూలై 30న కాంగ్రెసు తన విభజన విధానాన్ని ప్రకటించింది. అప్పటి నుంచి మార్చిలో ఎన్నికల కమిషన్ ఎన్నికల తేదీలను ప్రకటించేంత వరకు కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ బిల్లు పాస్ చేయించడం కోసం నానా కష్టాలు పడ్డది. తనకు స్వంత మెజార్టీ లేదని తెలిసి బీజేపీ ముందు మోకరిల్లి, వెంకయ్యనాయుడు ఇంటి చుట్టూ మంత్రులను తిప్పి పరువు పోగొట్టుకొని లోక్‌సభలో, రాజ్యసభలో బిల్లు పాస్ చేయించింది.
ఈ క్రమమంతా కూడా బీజేపీ నరేంద్ర మోదీ ఎన్నికల సభలు జరుపుతూనే పోయింది. కాంగ్రెస్ నాయకత్వం దేశంలో ఎన్నికల సభలు జరుపుకొని తమ ప్రచారం ప్రారంభించే బదులు టీఆర్ఎస్‌ను తమలో విలీనం చేసుకునే పనిలో తలమునకలై కాలాన్నంతా వృధా చేసుకున్నారు. ఎన్నికల ముందు రాష్ట్రం విడిపోయాక రాష్ట్ర సాధన కోసం పుట్టామని చెప్పే పార్టీకి లబ్ధి పొందే అవకాశం ఎక్కువ ఉంటుందని కనీసం ఆలోచన కూడా కాంగ్రెస్‌కు లేకపోయింది. ఈ ప్రక్రియతో సీమాంధ్రలో జీవితాంతం కోలుకోకుండా పోతే తెలంగాణలో చాలా కాలం వరకూ కోలుకోలేని స్థితిలో అది పడ్డది.
ఏ రాజకీయ పార్టీ గానీ 10 సంవత్సరాలు పరిపాలించాక, తిరిగి అధికారంలోకి వస్తే ప్రజలకు ఇంకా ఏం మంచి చేయబోతున్నారో చెప్పడానికి కావలసిన కొత్త నినాదాలను రూపొందించుకోవాలి. కానీ కాంగ్రెస్ కనీసం తను పదేళ్లలో ప్రజలకు ఇచ్చిన స్కీముల గురించి చెప్పుకోలేక పోయింది. కేంద్రంలో పదేళ్లు మంత్రులుగా పనిచేసిన వ్యక్తులు తమ, తమ రాష్ట్రాల్లో నాయకులుగా చలామణి కాలేని పరిస్థితిలో పడ్డారు. ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి భయపడే పరిస్థితిలో పడ్డారు. తెలంగాణలోనే చూడండి. ఇక్కడి నుంచి కేంద్రంలో సీనియర్ మంత్రిగా ఉన్న జైపాల్‌రెడ్డి తన నియోజకవర్గం బయట ఒక్క మీటింగ్ పెట్టి తాము రాష్ట్రం ఎలా సాధించామో చెప్పిన దాఖలాలు లేవు. సామాజిక తెలంగాణ ఒక అంశంగా ఉన్న ప్రాంతం కనుక పార్టీ నాయకత్వంలో ఒక బీసీ, ఒక ఎస్సీ నాయకునికి ప్రధాన పదవులిచ్చారని రెడ్డి సామాజికవర్గం మొత్తం టీఆర్ఎస్ పక్షం చేరితే సమాజ మార్పు ఒక పరిణామక్రమమని జైపాల్‌రెడ్డి వంటి నాయకులుకూడా వారికి నచ్చచెప్పిన దాఖలాలు లేవు. తమ పార్టీని తాము చంపుకోవడానికి సిద్ధపడ్డారు గానీ కొత్త నాయకత్వాన్ని గౌరవిద్దామనే ఆలోచన ఎక్కడా కనబడలేదు. తెలంగాణలో ఇతర కులాల అభివృద్ధి చూడలేక ఇక్కడి రెడ్లు తమ రాజకీయ ఆత్మహత్యకు సిద్ధపడ్డారు.
బీజేపీలో బీసీ సమాజం నుంచి వచ్చిన నరేంద్ర మోదీ అక్కడి అగ్రకుల నాయకులను పక్కనపెట్టి ఎదుగుతున్నప్పుడు ఆయన ప్రధానమంత్రి కాకుండా చూడాలని ఆ పార్టీలోని నాయకులు చాలా మంది ప్రయత్నించారు. కుల రాజకీయాలకు అలవాటు పడ్డ యూపీ, బీహార్ రాష్ట్రాల్లో బీసీలు మోదీని గట్టెక్కించారు. ఇదొక యాక్సిడెంటల్ గెలుపు. భారతదేశంలో తమకు అలవాటు లేని తిండి తినే దానికంటే చావడం మేలు అనుకునే కుల విలువలు ఉన్నాయి. ఈ విలువలు ఎన్నో హత్యలకు, ఆత్మహత్యలకు కారణాలౌతున్నాయి.
కొత్తగా ఏర్పడ్డ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజాజీవితం ఎలా ఉం టుందని ఇప్పుడే చెప్పలేం. ఇక్కడ మూడు అగ్రకులాలకు మూడు పార్టీలు ఉన్నాయి. కమ్మల నాయకత్వంలో తెలుగుదేశం, రెడ్ల నాయకత్వంలో వైఎస్ఆర్ సీపీ, వెలమల నాయకత్వంలో టీఆర్ఎస్. ఈ మూడు కులాలను పక్కకు పెట్టి వేరే కులాల నుంచి నాయకత్వం ఎదగడానికి అవకాశమిచ్చే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆత్మహత్య ఒక ఆకాంక్షగా జీవిస్తూ ఉన్నది. అది దానికి ఆనందంగా కూడా ఉన్నది.
సీమాంధ్రలో కాంగ్రెస్ ఇక చాలాకాలం పుంజుకోలేదు. అది తమిళనాడులోని పార్టీలాగా క్రమంగా కోమాలోకి పోతుంది. తెలంగాణలో బతికి బట్టకట్టే అవకాశం ఉన్నా, దాన్ని తిరిగి రెడ్ల చేతిలో పెట్టకపోతే అతి త్వరలోనే రెడ్లు తమ స్వంత పార్టీ కోసం ఆలోచిస్తారు. కింది కులాల్లో ఎన్నికల రంగాన్ని నడుపగలిగే డబ్బు గానీ, నాయకత్వ తెగింపు గానీ ఇంకా రాలేదు. దాన్ని ఎదగనిచ్చే పరిస్థితి కూడా లేదు. అలా ఎదుగడానికి చాలా కాలం పడుతుంది.
తెలంగాణ రాగానే 'సామాజిక తెలంగాణ' కాళ్ళకు గజ్జెలు కట్టుకొని నడిచి వస్తుందనుకున్న మేధావులకూ, కళాకారులకు ఇప్పుడైనా అర్థమైందో లేదో కానీ, అది అంత సులభం కాదని వాస్తవం చెబుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా కొంతకాలం అధికారం కమ్మ, రెడ్ల మధ్యనే ఉంటుంది. చిన్న రాష్ట్రాలను పెద్ద కులాలు (పెద్ద డబ్బు బలంలో) పరిపాలించడం సులభం. మునుముందు ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే అక్కడ బీఎస్పీ ఉనికిలో ఉండడం కూడా కష్టమే.
బీజేపీ ఒక పథకం ప్రకారమే చిన్న రాష్ట్రాల సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ను రెండుగా చీల్చి కాంగ్రెస్ ఆత్మహత్య చేసుకొని బీజేపీకి అధికారాన్ని, ఆనందాన్ని కట్టబెట్టింది. దేశంలో కాంగ్రెస్ రానున్న పది సంవత్సరాల్లో కోలుకుంటుందనే నమ్మకం కనిపించడం లేదు. నరేంద్ర మోదీ ఒక పక్క 'చాయ్‌వాలా' పునాదిని, బీసీ సామాజిక చైతన్యాన్ని కాంగ్రెస్‌ను అతులాకుతలం చేసేట్లు వాడుకున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శక్తులు కూడా అదే అదునుగాపెద్ద ఎత్తున బీసీలను సమీకరిస్తున్నది. దళితులు, ఆదివాసులు హిందూ వ్యవస్థకు బయట ఉండి క్రమంగా క్రిస్టియానిటీ తమ మతంగా ఎన్నుకుంటున్న నేపథ్యంలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి పదవి ఆయన ఎన్నికల్లో ఉపయోగించిన భాష బీసీల సమీకరణకు బాగా ఉపయోగ పడుతుంది. అయితే ఈ స్థితి బీసీలను ఎంత మారుస్తుందో చూడాలి.
కుల సమస్యను మేం గుర్తించమంటూ, వర్గం పేరుతో అగ్రకుల నాయకత్వాన్ని కాపాడుకోడానికి, పార్టీల పేర్లతో ఉన్న ఆస్తులను కాపాడుకోవడానికి కమ్యూనిస్టు పార్టీలు తమ రాజకీయ ఆత్మహత్యకు తామే పథకాలు వేసుకున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఆ పార్టీల్లో కొత్తగా చేరడమంటూ జరిగితే ఆధునిక జీవితానికి బయట ఉండి అగ్రకుల సేవ చెయ్యదలుచుకున్న వాళ్లే అవుతారు. మునుముందు కమ్యూనిస్టులు అంటే అగ్రకులస్థులు అనే పరిస్థితి వస్తుంది.
అంటే ఆత్మహత్య ఒక ఆకాంక్షగా జీవించడం వ్యక్తులకే కాదు, సామాజిక గుంపులకు, రాజకీయ పార్టీలకు వర్తిస్తుందని ఈ మధ్య కాంగ్రెస్‌ను, కమ్యూనిస్టు పార్టీలను చూస్తే మనకర్థమవుతుంది. దీనితో పాటు తెలంగాణ వంటి ఫ్యూడల్ ప్రాంతాల్లో విశాల ప్రజలు కూడా ఫ్యూడల్ ఆధిపత్యం బయట, ఆధునిక పెట్టుబడిదారీ విలువల్లో జీవించడానికి ఇష్టపడరని ఈ మధ్య పరిణామాలు, ఓటు విధానం స్పష్టంగా చెబుతున్నాయి. రోజూ దొరలతో తిట్లు తినేవారు ఒక వారం రోజులు దొర తిట్లు వినకపోతే జీవితంలో ఏదో కోల్పోయినట్లు ఫీల్ అవుతారు. పొలిటికల్ సైకాలజీలో 'ఫియర్ ఆఫ్ ఫ్రీడమ్' (స్వేచ్ఛ భయం) అని ఒక సిద్ధాంతం ఉంది. తరతరాలుగా బానిసత్వంలో బతికిన వారిని విముక్తి చేస్తే తమ జీవితంలోకి వచ్చే స్వేచ్ఛను వారు భరించలేరు. స్వేచ్ఛ భయం వారిని వెంటాడుతూ ఉంటుంది. కుల బానిసత్వం ఈ 'ఫియర్ ఆఫ్ ఫ్రీడమ్'ని ఇంకా పెద్ద స్థాయిలో పెంచి పోషిస్తుంది.
దయ్యాలను, భూతాలను నమ్మేవాళ్ళు మాంత్రికుడు నిమ్మకాయలు, వేపాకు కొమ్మలు పట్టుకొని పక్కన నిలబడితే కాస్త ధైర్యంగా జీవిస్తారు. రోడ్డు మీద పగులగొట్టి పడేసిన కొబ్బరికాయను చూసి భయపడి పడిపోయిన వాళ్ళూ ఉన్నారు. నేను ఆ ముక్కల్ని తీసుకొని తిన్నానని చెబితే ఐలయ్య కడుపు నిండా దయ్యాలున్నాయని నమ్మేవాళ్ళూ ఉన్నారు. భారతదేశపు ఫ్యూడలిజంలో మూఢనమ్మకం ఒక భాగం. ఈ ప్రాంత ప్రజలు ఇప్పుడు మూఢనమ్మకాల ప్రభుత్వాన్నే తెచ్చుకున్నారు.
కోస్తాంధ్ర ప్రాంతం కంటే తెలంగాణలో మూఢనమ్మకం చాలా ఎక్కువ. ఈ నమ్మకం పిల్లల చదువుల మీద తీవ్రమైన ప్రభావాన్ని పడేస్తుంది. పరీక్షల రోజున పుస్తకాలు చదువకుండా గంటల తరబడి గుళ్ళచుట్టూ ప్రదక్షిణలు చేసి పరీక్షలకొచ్చే విద్యార్థులు ఇక్కడ చాలా ఎక్కువ. ఈ సంస్కృతి ఫ్యూడల్ ఆధిపత్యాన్ని బాగా కాపాడుతుంది.
ఈ క్రమంలో అభివృద్ధిని విద్యతో ముడేసి చూసేబదులు వాస్తుతో ముడేసి చూస్తారు. ఇళ్లు, ఆఫీసులు, రైళ్లు, ఆఖరికి విమానాలు కూడా ముహూర్తం ప్రకారం నడవాలని అన్నిచోట్ల అయ్యగార్లను, పంచాంగాల్ని సమకూర్చుకునే రోజులు దూరం లేవు. ముందు, ముందు కొత్తగా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరక్కపోయినా, స్కూళ్ళు కాలేజీలు సరిగా నడువకపోయినా రాష్ట్ర ఉనికే వాస్తు ప్రకారం లేదంటే అందరూ నమ్మే పరిస్థితి ఉన్నది. ఈ మొత్తం ప్రక్రియ సమాజాన్ని క్రమంగా ఆత్మహత్య భావంలోకి నెడుతుంది. ఆత్మహత్యే లక్ష్యంగా పెట్టుకున్న వ్యక్తులు, గుంపుల్ని, సంస్థల్ని హేతువు ద్వారా బాగుచెయ్యడం అంత సులభమైన పనికాదు.
2002లో ది హిందూ పత్రికలో 'ది రైజ్ ఆఫ్ మోదీ' అని నేనొక వ్యాసం రాస్తూ కమ్యూనిస్టులూ, సెక్యులరిస్టులు బీసీల రాజకీయ ఆకాంక్షను గుర్తించకపోతే నరేంద్ర మోదీ వారి ప్రతినిధిగా ప్రధాన మంత్రి అభ్యర్థి అయ్యే అవకాశముందని చెప్పినప్పుడు, అది చదివి కమ్యూనిస్ట్, సెక్యులర్ మేధావులు 'ఈయనొక పిచ్చివాడని' నవ్వుకున్నారు. ఇప్పుడు వారంతా ఆత్మహత్య ఆలోచనలో ఉన్నారు. మోదీ ప్రధానమంత్రి అయితే నేనీ దేశంలో ఉండనని ప్రకటించిన వారు ఉన్నారు. ఇప్పుడతను ప్రధాని అయ్యారు. ఆత్మహత్య గురించి కాదు ఆలోచించాల్సింది. కులవ్యవస్థ హత్య గురించి. మూఢనమ్మకాల హత్య గురించి.
కంచ ఐలయ్య
సుప్రసిద్ధ రచయిత, సామాజిక శాస్త్రవేత్త

లేనిదేముంది..(కరపత్రం)- డా. చింతకింది శ్రీనివాసరావు

నీకు.. లేనిదేముంది
నీది.. కానిదేముంది
సింహాద్రి అప్పన్న గంధం ఉంది
తిరుపతి వెంకన్న బంధం ఉంది
ఫెళఫెళలాడే పెన్నా ఉంది
గలగలలాడే గోదారుంది
బావికొండలో బౌద్ధం ఉంది
అమరావతిలో తీర్థం ఉంది
విరివిగపండే పల్లం ఉంది
తరగల నురగల సముద్రముంది
పేదల ఊటీ అరుకుంది
అందాల హంసలదీవుంది
భీమిలి ఉంది, కావలి ఉంది
నావికాదళాల స్థావరముంది
విశాఖ వాకిట ఉక్కుంది
తూర్పు కనుమపై హక్కుంది
ఉత్తరదిక్కున సిరిమానుంది
బాబామెట్ట దీవిస్తోంది
నన్నయ్యస్ఫూర్తి భారతముంది
అన్నమాచార్య గీతం ఉంది
వేమన్న చెప్పిన వేదం ఉంది
త్యాగయ్య మీటిన నాదం ఉంది
గుర్రం జాషువా పద్యం ఉంది
బొబ్బిలి వీరుల రోషం ఉంది
పలనాటి బ్రహ్మన్న మీసం ఉంది
నీ నరాల్లో నెత్తురు ఉంది
నీ కణాల్లో సత్తువ ఉంది
నీ చేతుల్లో నవ్యాంధ్ర ఉంది
నీ చేతల్లో భవ్యాంధ్ర ఉంది
నీకు.. లేనిదేముంది
నీది కానిదేముంది
- డా. చింతకింది శ్రీనివాసరావు
(కొత్త రాష్ట్రంపై కోటి ఆశలతో..
నవ్యాంధ్ర ప్రజాళికి శుభాకాంక్షలతో..)
ఆంధ్ర జ్యోతి సౌజన్యముతో 

తెలుగు సంప్రదాయం గల బంగారు ఆభరణాలు


తెలుగు సంప్రదాయం గల బాలిక


తెలుగు ఇంటి ఆడపడుచు